ఆధునిక విద్యతో పాటు మన మూలాలను, భారతీయ సంస్కృతిని విద్యార్థులకు పరిచయం చేయడం ఎంతో అవసరమని విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ అన్నారు. బండ్లగూడ జాగీర్‌లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ (SVIS) లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులు సంప్రదాయ దుస్తులైన పంచె-కుర్తా, లంగా-ఓణీలలో మెరిసిపోయారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుతూ వేసిన రంగురంగుల ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.సంక్రాంతి ప్రాముఖ్యతను చాటిచెప్పేలా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు మరియు పాటలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అలరించాయి.సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదని, అది రైతులకు, వ్యవసాయానికి మరియు కుటుంబ బంధాలకు ఇచ్చే గౌరవమని ఈ సందర్భంగా పిల్లలకు వివరించారు.
ఈ కార్యక్రమాన్ని స్కూల్ కార్యదర్శి డాక్టర్ విశ్వేశ్వరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిష్ణమోహన్ పర్యవేక్షణలో స్విస్ (SVIS) టీమ్ అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించింది. వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, కోఆర్డినేటర్లు అనురాధ, సరళ, గోకులన్ జీ తదితరులు ఈ వేడుకల విజయవంతంలో కీలక పాత్ర పోషించారు.
