శ్రీశైలం అటవీ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను ఏప్రిల్ నెల లోపు పూర్తిగా తొలగిస్తామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మరియు అటవీ శాఖ అధికారులతో కలిసి అటవీ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు.
శ్రీశైలంలో రోజువారీ ఉత్పత్తి అవుతున్న 16 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు దోర్నాల వద్ద ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని దేవస్థానానికి పట్టాభిరామ్ సూచించారు. దీనికి కార్పొరేషన్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. చెత్త సేకరణను వేగవంతం చేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరఫున 3 ఎలక్ట్రిక్ వాహనాలను శ్రీశైలం దేవస్థానానికి అందజేయనున్నట్లు ప్రకటించారు. హోటళ్లు, సత్రాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తామన్నారు. అంతకుముందు పట్టాభిరామ్ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోగా, దేవస్థానం అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో అటవీ అధికారి బబిత కుమారి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
