పాకిస్థాన్ పై భారత్ భారీ విజయం.. హ్యాండ్ షేక్ కూడా ఇవ్వలేదు!!

June 15, 2026 8:54 AM
team india indvspak

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని భారత జట్టు చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయంతో ప్రారంభించింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36) చక్కటి సహకారం అందించి మూడో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆఖరి ఓవర్లలో వికెట్ కీపర్ రిచా ఘోష్ (17 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్సర్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలో మంచి భాగస్వామ్యం లభించింది. ఓపెనర్ మునీబా అలీ (41) రాణించగా.. పవర్‌ప్లేలో పాక్ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసి మ్యాచ్ లో నిలిచింది. స్పిన్నర్ దీప్తి శర్మ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణి 3 వికెట్లు, షఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టడంతో పాక్ ఇన్నింగ్స్ 17 ఓవర్లలో 106 పరుగులకే ముగిసింది. ఈ విజయంతో భారత్ ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. ఇక మ్యాచ్ సమయంలో ఇరు దేశాల మధ్య ఆటగాళ్లు కనీసం కరచాలనం చేసుకోలేదు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media