పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించే చర్యలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కొండా సురేఖ సస్పెన్షన్‌కు డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సుమారు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించే నేతలపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి, ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు.
సుస్మిత వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు?
కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం సరికాదని కాంగ్రెస్ నేతలు అన్నారు.
ఆ వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే.. కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఆమె ఎందుకు బహిరంగంగా ఖండించలేదని ప్రశ్నించారు.
కొండా కుటుంబం మాట్లాడే తీరు పార్టీకి తరచూ ఇబ్బందిగా మారుతోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.
బహిరంగ విమర్శలు చేయొద్దు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు ఎంతో కష్టపడి పనిచేశారని నేతలు గుర్తుచేశారు.
సీఎం, పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
పార్టీలో ఏవైనా అసంతృప్తులు లేదా సమస్యలు ఉంటే వాటిని సీఎల్పీ లేదా పీసీసీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలని సూచించారు.
పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తూ విపక్షాలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్న వారిపై ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



