కొత్త నిబంధనలు ఇవే
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీగా ఉన్న 7,437 పోలీసు, అనుబంధ విభాగాల ఉద్యోగాల నియామక ప్రక్రియ నేటి ఉదయం 8 గంటలకు అధికారికంగా ప్రారంభమైంది.
రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TGPRB) ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపడుతున్నారు.
పోలీసు శాఖతో పాటు ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్సై, ఏఎస్సై, సివిల్, ఏఆర్ కానిస్టేబుల్స్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టులు ఉన్నాయి.
ఈ అవకాశాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి
వయోపరిమితి సడలింపుతో ఈసారి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దీంతో నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం తొలిసారిగా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ను తప్పనిసరి చేశారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా తమ ఫోన్‌లో ఆధార్ యాప్ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియను పార్ట్-1, పార్ట్-2గా విభజించారు.
ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి
అభ్యర్థులు మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్‌తో పాటు తమ విద్యార్హతలు, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
సరైన పరిమాణంలో ఉన్న ఫొటో, సంతకాన్ని కూడా నిబంధనల ప్రకారం అప్‌లోడ్ చేయాలి.
సెప్టెంబర్ 9 చివరి తేదీ
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
చివరి రోజు వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని ముందుగానే అప్లై చేసుకోవాలని సూచించారు.
పోస్టుల వివరాలు, అర్హతలు, సిలబస్, దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారాన్ని TGPRB అధికారిక నియామకాల పేజీలో పరిశీలించాలి.
ప్రభుత్వ తాజా ప్రకటనల కోసం తెలంగాణ స్టేట్ పోర్టల్ను కూడా క్రమం తప్పకుండా పరిశీలించాలని అధికారులు సూచించారు.



