ఉపరితల ఆవర్తనంతో మళ్లీ పెరిగిన వర్షాలు
Telangana: కొద్దిరోజులుగా తగ్గిన వర్షాలు తెలంగాణలో మళ్లీ జోరందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది.హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం (IMD) ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఆదివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా కనిపించింది.
ప్రధానంగా నమోదైన వర్షపాతం
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో 5.1 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 4.7 సెం.మీ., పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ముత్తారంలో 4.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా కల్హేర్, మెదక్ జిల్లా టేక్మల్‌లో 4.2 సెం.మీ., కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి.
హైదరాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం
వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్బీఐ రోడ్డులో రవీంద్రభారతి సమీపంలో తెల్లవారుజామున భారీ వృక్షం నేలకూలింది.
చెట్టు కింద ఉన్న విద్యుత్తు స్తంభం విరిగిపడటంతో పాటు రోడ్డుపై ఉన్న ఓ ఆటో పూర్తిగా ధ్వంసమైంది.
చెట్టు కూలుతున్న విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే కిందకు దూకి పరుగులు తీశాడు. దీంతో పెను ప్రాణాపాయం తప్పింది.
16 జిల్లాలకు ఎల్లో అలర్ట్
సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.



