BRS కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడుల నేపథ్యంలో BRSవర్కింగ్ ప్రెసిడెంట్ KTR రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం, ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్‌పేట్‌లో దాడిలో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిట్ల బాలరాజు, గంజి భారతి దంపతులను ఆయన పరామర్శించారు.

దాడిలో గాయపడిన గంజి భారతి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె పెల్విస్ ఎముకలు విరిగి, యూరినరీ బ్లాడర్ దెబ్బతినడంతో మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తూ, రౌడీలు దాడులు చేస్తుంటే నిశ్చేష్టులుగా ఉండటం దారుణమని డీజీపీ స్థాయి అధికారులను హెచ్చరించారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోతే, “ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని కేటీఆర్ సంచలన హెచ్చరిక చేశారు.

BRS DEMANDS: దాడికి పాల్పడిన వారిపై, ప్రేరేపించిన వారిపై వెంటనే ‘అటెంప్ట్ టు మర్డర్’ (హత్యాయత్నం) కేసులు నమోదు చేయాలని, బాధితులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.బాధిత కుటుంబానికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను బీఆర్‌ఎస్ పార్టీనే భరిస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
