Congress ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. జూబ్లీహిల్స్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సినీ ప్రముఖులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు.
సినీ పరిశ్రమ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్య అంశమని ఆయన తెలిపారు. “తెలంగాణ సినీ పరిశ్రమను దేశంలోనే అత్యాధునికంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం” అన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గతంలో చెన్నై నుంచి తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు స్టూడియోల కోసం భూములు కేటాయించిందీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. భవిష్యత్తులో సినీ కార్మికులకు మరింత మద్దతు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి హామీ ఇచ్చారు.
హైదరాబాద్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న నగరమని, ఇక్కడ ఫిలిం సిటీ స్థాపనతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

