ప్రశాంతత లేని అక్రమ సంపాదనా మార్గంలో పయనించిన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీకి (Anti-Corruption Bureau) అడ్డంగా దొరికిపోయారు. రేపో మాపో ఐఏఎస్ అర్హత పొందబోతున్న ఈ అధికారి అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ఛాంబర్‌లోనే, ఒక ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యువల్ కోసం రూ. 60 వేల లంచం తీసుకుంటుండగా వెంకట్ రెడ్డిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంకట్ రెడ్డి ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్‌తో పాటు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వెంకట్ రెడ్డితో పాటు ఈ కేసులో పాలు పంచుకున్న విద్యాశాఖ సిబ్బంది అయిన గౌస్, మనోజ్‌లను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భాగంగా, హనుమకొండలోని అద్దె ఇంట్లో రూ. 30 లక్షల నగదు లభ్యం కావడంతో సీజ్ చేశారు. అలాగే, హైదరాబాద్ నివాసంలో విలువైన భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.వెంకట్ రెడ్డిపై గతంలో నల్గొండ జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. అలాగే జనగామ RDOగా పనిచేసినప్పుడు బైపాస్ రోడ్డు విషయంలో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ తెలిపింది.
వెంకట్ రెడ్డి అరెస్ట్‌తో, గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులు (ఊరుకొండ, ఆరేపల్లి, వంగపహాడ్) హన్మకొండ కలెక్టరేట్ ముందు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
