తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హరీష్ రావుపై దర్యాప్తుకు సంబంధించి దిగువ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత దశలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరును చేర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ తీర్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో హరీష్ రావుకు ఈ కేసులో తాత్కాలికంగా న్యాయపరమైన చిక్కులు తొలగినట్లయ్యింది.
Telengana:ఫోన్ ట్యాపింగ్ కేసు హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట
