హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంపై కేంద్ర హోంసహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కకాటుకు మందు కూడా అందుబాటులో లేకపోతే పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సర్కార్ ఆసుపత్రులకు వచ్చే వారు పేదలు, మధ్యతరగతి ప్రజలేనని, వారికి ప్రైవేట్ చికిత్స భారం భరించలేరని చెప్పారు.

ఎన్‌ఎండీసీ సీఎస్సార్ నిధులతో దాదాపు రూ.1 కోటి విలువైన 15 రకాల ఆధునిక వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి అందజేశారు. ఈసీజీ మిషన్లు, అల్ట్రాసౌండ్, ఈఎన్టీ మైక్రోస్కోప్, మానిటర్లు, మార్ట్యూరీ కేబినెట్ వంటి పరికరాలను మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రి వార్డులను సందర్శించి సేవలపై విచారణ చేశారు.
సంజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదులు, మందులు, పరికరాలు లేకపోవడం ఆందోళనకరమని, రాష్ట్ర ప్రభుత్వం సరైన నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆసుపత్రులకు మరిన్ని సౌకర్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

“ఇకపై ఒక రోగి కూడా చికిత్స కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. మానవ సేవే మాధవ సేవ” అని వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు.

