Telengana :జ్యోతిస్మతి ఇంజనీరింగ్ కాలేజ్ కబ్జా : AIFB నిరసన

November 24, 2025 4:30 PM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ గ్రామంలోని 574, 576 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని జ్యోతిస్మతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసిందని ఆరోపిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) నాయకులు నిరసన నిర్వహించారు. కలెక్టరేట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం, అధికారులు కండ్లు తెరిచి చర్యలు తీసుకోవాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ, 2007లో ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని తహసిల్దార్ సర్క్యులర్ జారీ చేసిందని, కానీ ఇప్పటికీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్డీవో కోర్టు, అడిషనల్ కలెక్టర్ కోర్టు, హైకోర్టు భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించినప్పటికీ అమలు జరగలేదని పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న భూమి 19 ఎకరాలు, విలువ ₹70 కోట్లు పైగా ఉంటుందని చెప్పారు.

ఘటనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా ఏఐఎఫ్‌బీ డిమాండ్ చేసింది. ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి మాట్లాడుతూ, 15 ఏళ్లుగా ‘స్టే’ పేరుతో ఆలస్యం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు ఇవ్వాలని లేదా ప్రజా అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంకూరి సురేందర్, జీ. ప్రశాంత్, బద్రినేత, రావుల ఆదిత్య, రాజిరెడ్డి, అరుణ్ రాజు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media