కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల పరిధిలోని వెల్ది గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి కోరుకంటి మధు సూదన్ రావు వినూత్న హామీతో వార్తల్లో నిలిచారు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం సొంతంగా ₹30 లక్షలు విరాళం ఇస్తానని హామీ పత్రాన్ని ప్రకటించారు.
గెలిస్తే స్వచ్ఛందంగా ₹30 లక్షలు విరాళంగా ఇచ్చి, ఆ నిధులతో గ్రామాభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని తెలిపారు. అవినీతికి తావు లేకుండా నిజాయితీ పరిపాలన అందిస్తానని, అవసరమైతే ప్రభుత్వ నిధులను కూడా మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు.ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచకుండా, కేవలం యువత, మహిళల ఆధ్వర్యంలో కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నట్లు తెలిపారు. తన గుర్తు ‘బ్యాట్’ గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు. మధుసూదన్ రావు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
