దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ గడ్డపై జనసేన సాధించిన ఈ విజయం సరికొత్త మార్పుకు నాంది” అని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం, ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 53 మంది సర్పంచులు, వార్డు సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పంచాయతీల నుంచే అభివృద్ధి ప్రస్థానం మొదలవుతుందని, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా మీరు వేసిన అడుగు తెలంగాణ రాజకీయాల్లో బలమైన మార్పుకు సంకేతమని అభినందించారు.పార్టీ పోటీ చేసిన స్థానాల్లో సగం చోట్ల విజయం సాధించడం అద్భుతమని, ఇది క్షేత్రస్థాయిలో జనసేన పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరమని, సైద్ధాంతిక బలంతో నాయకులుగా ఎదగాలని సూచించారు. సిద్ధాంతం ప్రాతిపదికన ఎదిగిన వారిని ఎవరూ ఆపలేరని తన రాజకీయ ప్రయాణాన్ని ఉదాహరణగా చెప్పారు. తనకు పోరాట పటిమను, ధైర్యాన్ని ఇచ్చింది తెలంగాణ నేల అని అమర వీరుల స్ఫూర్తి, రజాకార్ల వ్యతిరేక పోరాటాలే తనను రాజకీయాల్లో నిలబెట్టాయని భావోద్వేగంగా మాట్లాడారు. రెండు రాష్ట్రాల రాజకీయాలు వేరైనా, తెలుగు ప్రజల ఐక్యత కోసం రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
