రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మీర్జగూడ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతులు దొంతానపల్లిలోని IBS (ICFAI Business School) కళాశాలకు చెందిన BBA మూడవ సంవత్సరం విద్యార్థులుగా గుర్తించారు. సుమిత్ (20), నిఖిల్ (20), రోహిత్ (18), సూర్యతేజ (20) ఈ ప్రమాదంలో మరణించారు. కారులో ఉన్న మరో విద్యార్థిని నక్షత్ర (20) తీవ్రంగా గాయపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థులంతా కారులో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
