వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ మరియు హనుమకొండ నగరాల్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు.

ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

వరంగల్ బట్టల బజార్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గీతా భవన్, మరియు హనుమకొండ చైతన్యపురి కాలనీలోని ఆలయాల్లో ఉదయం 4 గంటల నుంచే భక్తులు బారులు తీరారు.ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
