ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ 2047’ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని కోరుతూ, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఆహ్వాన పత్రికను అందించారు. కరీంనగర్ కేంద్రంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఈ భేటీ జరిగింది.

డిసెంబర్ 8, 9 తేదీలలో జరిగే ఈ సమ్మిట్ ద్వారా విజన్ తెలంగాణ 2047ను ప్రపంచానికి తెలియజేస్తామని అన్నారు.తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల టార్గెట్‌తో ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆశిస్తోంది. దీని కోసం అన్ని పార్టీలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వాల ధోరణికి భిన్నంగా, ఇప్పుడు రాష్ట్రం, దేశం కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు.

ఈ విజన్ డాక్యుమెంట్ వాస్తవానికి దగ్గరగా ఉందని, అందరం కలిసి ఐక్యంగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందని తెలిపారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు
