నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో భారీగా నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఒక రైతు బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు తెచ్చిన డబ్బులో ఏకంగా రూ. 2 లక్షలకు పైగా నకిలీ నోట్లు ఉండటంతో అధికారులు అవాక్కయ్యారు.

జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు. చిన్న సాయిలు తన క్రాప్ లోన్ చెల్లించడానికి రూ. 2,08,500 నగదుతో కెనరా బ్యాంకుకు వెళ్ళాడు. క్యాషియర్ ఆ నోట్లను కౌంటింగ్ మెషీన్లో వేయగా, అందులోని 417 నోట్లు (అన్నీ 500 రూపాయలవే) నకిలీవిగా తేలాయి. మొత్తం 2 లక్షల 8 వేల 500 రూపాయలు పూర్తిగా నకిలీవని తేలడంతో బ్యాంకు వర్గాలు షాక్కు గురయ్యాయి. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు వర్ని ఎస్ఐ రాజు కేసు నమోదు చేశారు. ఆ రైతుకు ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న నకిలీ నోట్ల ముఠా ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
