తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
తెలంగాణ: తెలంగాణలో బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీనికి రుతుపవన ద్రోణి ప్రభావం కూడా తోడైంది.
దీంతో తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తాజా వెదర్ బులిటెన్‌లో వెల్లడించింది.
రాబోయే మూడు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం
ఎల్‌నివో ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా పెద్దగా భారీ వర్షాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఏపీలో పిడుగుపాటు హెచ్చరికలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
పలు జిల్లాలకు ఇప్పటికే పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
మత్స్యకారులకు కీలక సూచన
సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.



