నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, కళాత్మక ప్రదర్శనకు వేదిక కాబోతోంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా విష్ణుమూర్తి దశావతారాల సైకత శిల్పాల (Sand Art) ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. విజయ్ అగర్వాల్, స్పార్క్ మీడియా మరియు లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతోంది. ప్రముఖ సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం 170 టన్నుల ఇసుకతో విష్ణుమూర్తి పది అవతారాలను, అలాగే ప్రత్యేక ఆకర్షణగా వినాయకుని ప్రతిమను రూపొందిస్తున్నారు.

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమై, వరుసగా 25 రోజుల పాటు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 15 లక్షలు ఖర్చు అవుతోందని, ప్రతి విగ్రహానికి దాదాపు రూ. 2 లక్షల వరకు వ్యయం అవుతోందని నిర్వాహకులు తెలిపారు.

ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకానున్నారు. నిర్వాహకులు విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆర్మూర్ ప్రజలకు ఈ అద్భుత దృశ్యాన్ని అందించడం సంతోషంగా ఉందని, దాతలు ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

