తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అకున్ సబర్వాల్ సేకరించిన కీలక ఆధారాలను అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ తొక్కిపెట్టారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్ పెడ్లర్ల విచారణలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు బయటకు వచ్చాయని, ఆ ఆడియో, వీడియో రికార్డులు బయటపడితే రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతోనే అకున్ సబర్వాల్‌ను బాధ్యతల నుండి తప్పించారని బండి సంజయ్ పేర్కొన్నారు. నాటి విచారణ నివేదికలు, స్టేట్‌మెంట్లను సోమేష్ కుమార్ తదుపరి బృందానికి గానీ, కోర్టుకు గానీ అందజేయలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సోమేష్ కుమార్‌ను విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్’ టీంలో కొందరు అధికారులు డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని, నిన్నటి దాడిలో పట్టుబడ్డ వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో నిజానిజాలు బయటకు రావాలంటే అకున్ సబర్వాల్ వంటి సమర్థులైన అధికారులకు తిరిగి విచారణ బాధ్యతలు అప్పగించాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
