నగరంలోని ప్రధాన బట్టల బజార్లో అంతర్జాతీయ బ్రాండ్ల పేరుతో సాగుతున్న నకిలీ వస్త్రాల దందాను ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ప్రముఖ కంపెనీల ట్యాగ్లతో నకిలీ దుస్తులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు వ్యాపారులు హోల్సేల్ షాపుల పేరుతో ప్రముఖ బ్రాండ్ల (Levi’s, Adidas, Nike వంటివి) డూప్లికేట్ వస్త్రాలను విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

ఒరిజినల్ కంపెనీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్లు మరియు ఢిల్లీ పోలీస్ బృందం స్థానిక వరంగల్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో వేలాది సంఖ్యలో నకిలీ బ్రాండెడ్ జీన్స్, షర్టులు, ఇతర వస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. ఈ మెరుపు దాడులతో బట్టల బజార్లోని ఇతర వ్యాపారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
