కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త చింతకింది రంజిత్ పై కాంగ్రెస్ శ్రేణులు గొడ్డలితో కిరాతకంగా దాడి చేశాయి. ఈ దాడిలో రంజిత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలవడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గొడ్డలితో దాడి చేయడంతో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొద్దిరోజుల క్రితమే సోమర్‌పేటలో ఇటువంటి దాడి జరగగా, ఇప్పుడు గాంధారి మండలంలో మళ్ళీ హింస చెలరేగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అండతోనే కాంగ్రెస్ శ్రేణులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు
