కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన రూ.1 కోటి దోపిడి కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. మిరప పొడి చల్లి దాడి చేసి నగదు దోచుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ అజీముద్దీన్ తన సహచరుడు ఖుస్రౌద్దీన్‌తో కలిసి హవాలా నగదు సేకరణలో భాగంగా రూ.1 కోటి నగదు తీసుకుని బైక్‌పై వెళ్తుండగా ఈ దోపిడి జరిగింది.ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఖుస్రౌద్దీన్ తన అనుచరులతో కలిసి పిలర్ నెం. 836 సమీపంలో మిరప పొడి చల్లి దాడి చేశారు. దాంతో బాధితులు కిందపడగా నగదు సంచిని లాక్కుని పరారయ్యారు.ఘటన స్థలంలో వదిలిన హోండా యాక్టివా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒమర్ షరీఫ్, హమీద్, సద్దామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు.నిందితుల వద్ద నుంచి రూ.77,78,195 నగదు, ఒక హోండా యాక్టివా, 5 మొబైల్ ఫోన్లు, విమాన టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వేగంగా చర్యలు చేపట్టి కేసును ఛేదించగా, వారి పనితీరును సైబరాబాద్ కమిషనర్ అభినందించారు.

