పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను వెలికితీసేందుకు మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ విజయవంతమైంది. సి.పి. అవినాష్ మొహంతి నేతృత్వంలో ఐటి సెల్ మరియు సీసీఎస్ బృందాలు CEIR పోర్టల్ సహాయంతో ఆరు నెలల వ్యవధిలో రూ. 2 కోట్ల 8 లక్షల విలువైన 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేశాయి.
రికవరీ చేసిన ఫోన్లలో ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 4733 ఫోన్లను పోలీసులు రికవరీ చేయడం విశేషం. గురువారం (జనవరి 8) కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సి.పి. అవినాష్ మొహంతి చేతుల మీదుగా మొబైల్ ఫోన్లను వాటి అసలైన యజమానులకు అందజేశారు. అదనపు డిసిపి క్రైమ్స్ శ్రీ రామేశ్వర్, ఎసిపి కరుణ సాగర్ నోడల్ అధికారులుగా వ్యవహరించి ప్రత్యేక బృందాలను పర్యవేక్షించారు. తమ విలువైన డేటాతో కూడిన ఫోన్లను తిరిగి పొందిన యజమానులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచనలు:
బిల్లు లేకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనడం నేరం.
రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఫోన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఫోన్లలో ‘Find My Device’ సెట్టింగ్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోవాలి.
ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్‌లో నమోదు చేయాలి.
