ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర మేడారంలో అత్యంత ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ‘సమ్మక్క ఆగమనం’ గురువారం (జనవరి 29, 2026) రాత్రి అత్యంత వైభవంగా జరిగింది.
చిలకలగుట్టపై ప్రధాన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని జనారణ్యంలోకి తీసుకువచ్చారు. గిరిజన సంప్రదాయం ప్రకారం, ఒక వీరనారికి ఇచ్చే గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అమ్మవారికి అధికారిక స్వాగతం పలికారు.
అమ్మవారు గుట్ట దిగి గద్దెకు చేరుతుండగా భక్తులు ‘జై సమ్మక్క.. జై సారక్క’ నినాదాలతో మేడారం అడవిని మారుమోగించారు. దారిపొడవునా భక్తులు ఎదురుకోళ్లు ఇస్తూ, కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికే గద్దెపై కొలువుదీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతో సమ్మక్క చేరడంతో దైవ కుటుంబం సంపూర్ణమైంది. శుక్రవారం (జనవరి 30) నాడు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మరియు ఉన్నతాధికారులు మేడారంలోనే ఉన్నారు.
