అత్యంత కట్టుదిట్టమైన భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా భావించే నిజామాబాద్ సెంట్రల్ జైలు వరుస వివాదాలకు నిలయంగా మారుతోంది. తాజాగా జైలులో గంజాయి లభ్యం కావడం తీవ్ర సంచలనం రేపింది. అధికారుల నిఘా వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జైలులోకి గంజాయి, సిగరెట్లు మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఎలా చేరాయనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. జైలు భద్రతా వలయాన్ని దాటి లోపలికి ఇవి రావడం వెనుక అధికారుల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి వినియోగించారనే నెపంతో ఇద్దరు ఖైదీలను జైలు అధికారులు విచక్షణారహితంగా చితకబాదారు. ఈ దాడిలో ఒక ఖైదీకి పక్కటెముకలు విరగగా, మరొకరికి కాలు విరిగింది.

గాయపడిన ఖైదీల పరిస్థితి విషమించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. లోపలికి గంజాయి ఎలా వచ్చిందనే దానిపై లోతైన విచారణ జరపాల్సింది పోయి, ఖైదీలపై భౌతిక దాడికి దిగడంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో ఇదే జైలులో అక్రమ మొరం తవ్వకాలు, ఖైదీల వద్ద డబ్బులు వసూలు చేయడం మరియు అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం గమనార్హం.
