కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. శనివారం మధ్యాహ్నం ఆలయ దర్శనం, అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు పార్టీ శ్రేణులతో సమావేశం ముగించుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న సమాచారంతో కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి ప్రధాన రహదారి వరకు వేలాది మంది అభిమానులు, జనసేన సైనికులు బారులు తీరారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసిన పవన్ కళ్యాణ్, తన కారుపై కూర్చుని అభివాదం చేస్తూ ముందుకు సాగారు. “సీఎం సీఎం” మరియు “జై జనసేన” నినాదాలతో కొండగట్టు పరిసరాలు మారుమోగాయి.
రహదారికి ఇరువైపులా నిలబడ్డ ప్రజలకు చేతులు ఊపుతూ, నమస్కరిస్తూ పవన్ సాగారు. కమలాపూర్ మరియు కొడిమ్యాల మీదుగా సాగిన ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
పవన్ కారుపైకి రావడంతో జనాన్ని నియంత్రించడం పోలీసులకు కష్టతరమైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1100 మంది పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు.
