కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట తండాలో విషాదం చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి గుగులోత్ జైనపై వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం, నోటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

అంగన్వాడీ కేంద్రం ముగిసిన తర్వాత టీచర్ విజయ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్తుండగా, చిన్నారి ఆమె కంటే కాస్త ముందుకు వెళ్ళింది. అదే సమయంలో మాటువేసిన వీధి కుక్క చిన్నారిపై పడి విచక్షణారహితంగా దాడి చేసింది. టీచర్ విజయ కుక్కను తరిమికొట్టే ప్రయత్నం చేయగా, అది ఆమెపైకి కూడా తిరగబడింది. చిన్నారి కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి కుక్కను తరిమికొట్టారు. గాయపడిన బాలికను వెంటనే సిరిసిల్ల ఆసుపత్రికి, అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ (NIMS)కు తరలించారు. అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వీధి కుక్కల సమస్యపై అధికారులు స్పందించడం లేదని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
