తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ సూచించారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ‘రోడ్ సురక్ష అభియాన్ 2026’లో భాగంగా పోచమ్మ మైదాన్ జంక్షన్ వద్ద చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని కోరారు. లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, ఇవి లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముఖ్యంగా పిల్లలకు వాహనాలకు బదులు సైకిల్ తొక్కడం అలవాటు చేయాలని, దీనివల్ల వారికి మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లేకపోతే సదరు కుటుంబాలు ఎంతలా నష్టపోతాయి ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆమె హితవు పలికారు.

