NIA అధికారి అంటూ బెదిరింపులు
అప్రమత్తంగా వ్యవహరించడంతో డబ్బు మొత్తం సేఫ్
HYDERABAD: హైదరాబాద్‌లో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి డిజిటల్ అరెస్ట్ మోసానికి గురయ్యారు. నేరేడ్మెట్కు చెందిన ఆయన నుంచి సైబర్ నేరగాళ్లు రూ.85.20 లక్షలు బదిలీ చేయించుకున్నారు. అయితే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు వేగంగా స్పందించి ఆ మొత్తాన్ని కాపాడారు.
NIA అధికారి అంటూ భయపెట్టిన మోసగాడు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారినంటూ ఓ వ్యక్తి వృద్ధుడికి ఫోన్ చేశాడు. ఆయన ఆధార్ వివరాలను ఉపయోగించి ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాలు తెరిచాడని చెప్పాడు.
కర్ణాటక, కేరళలో సుమారు రూ.2.5 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు నమ్మించాడు.
తెలుగులో మాట్లాడిన ఆ వ్యక్తి పోలీస్ యూనిఫామ్‌లో వీడియో కాల్లో కనిపించాడు. అరెస్ట్ చేస్తామని, తీవ్ర న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వృద్ధుడిని బెదిరించాడు.
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని సూచించాడు. చెబితే పోలీసులు ఇంటికి వస్తారని భయపెట్టాడు.
RBI వెరిఫికేషన్ పేరుతో రూ.85.20 లక్షలు
తనను నిజమైన ప్రభుత్వ అధికారిగా నమ్మిన వృద్ధుడు.. RBI వెరిఫికేషన్ పేరుతో సూచించిన బ్యాంక్ ఖాతాకు రూ.85.20 లక్షలు బదిలీ చేశారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఇస్తామని మోసగాడు చెప్పాడు.
అయితే ఆ తర్వాత మరో రూ.42 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. వెంటనే తన బ్యాంకును సంప్రదించగా.. తాను సైబర్ మోసానికి గురవుతున్నట్లు తెలిసింది.
వెంటనే స్పందించిన TGCSB
వృద్ధుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫిర్యాదు చేశారు. TGCSB అధికారులు వెంటనే డబ్బు లావాదేవీలను ట్రేస్ చేశారు. IDFC Bank కోయంబత్తూరు బ్రాంచ్‌లో ఉన్న అనుమానితుడి ఖాతాను ఫ్రీజ్ చేశారు.
దీంతో వృద్ధుడు బదిలీ చేసిన మొత్తం రూ.85.20 లక్షలు సురక్షితంగా కాపాడారు. తదుపరి న్యాయపరమైన చర్యల కోసం ఫిర్యాదును మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
ప్రభుత్వ అధికారులు డబ్బులు అడగరు
నిజమైన పోలీసులు, NIA, CBI, RBI లేదా ఇతర ప్రభుత్వ అధికారులు వెరిఫికేషన్, దర్యాప్తు లేదా భద్రత పేరుతో డబ్బులు బదిలీ చేయాలని ఎప్పుడూ అడగరని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు.
ఆర్థిక సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.



