డిసెంబర్ 5 నుంచి 14 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు
- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
- విద్యుత్ అలంకరణలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జేఈవో శరత్ సూచించారు.
- భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు ఉత్సవాలను కూడా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.
ఈ మేరకు టీటీడీ జేఈవో శరత్ అధికారులతో సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అనంతరం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
కనువిందు చేయనున్న విద్యుత్ అలంకరణలు
గతేడాది కంటే ఈ ఏడాది విద్యుత్ అలంకరణలు మరింత ఆకర్షణీయంగా ఉండాలని జేఈవో శరత్ సూచించారు. భక్తులను ఆకట్టుకునేలా, అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవం కనిపించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతిలోని ప్రధాన కూడళ్లను విద్యుత్ వెలుగులతో అలంకరించాలని అధికారులకు సూచించారు.
గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో ప్రత్యేక చర్యలు
బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈవో శరత్ పరిశీలించారు. పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గజవాహనం, పంచమి తీర్థం రోజుల్లో పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు.
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేఈవో శరత్ చెప్పారు.
అనంతరం అధికారులతో కలిసి ఉద్యానవనం, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలు, వాహన మండపం, నాలుగు మాడ వీధులు, గేట్ నెంబర్ 1, 2, 3 ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో అవసరమైన మార్పులు, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.


