శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారు పుష్కరిణిలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారు మూడుసార్లు చుట్టి భక్తులను కటాక్షించారు.

ముందుగా ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి, సాయంత్రం పుష్కరిణి వద్దకు చేర్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ తెప్పోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. పుష్కరిణి తీరంలో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో డా. ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.రేపు (ఆదివారం) మూడవరోజు తెప్పోత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు.

