అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ ఆధిపత్యం సాధించింది. సెనేట్‌లో 5 సీట్లు, ప్రతినిధుల సభ (హౌస్)లో అరడజనుకు పైగా స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ ఫలితాలు ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపడంతో పాటు ఆయన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తననే బ్యాలెట్‌పై ఉన్న అభ్యర్థిగా భావించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. దీంతో ఈ ఎన్నికలను ట్రంప్ పాలనకు రెఫరెండంగా కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. డెమొక్రాట్ల విజయం రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది.
ట్రంప్ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మరోవైపు ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఇంధన ధరలు కూడా పెరిగాయి. ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన వాణిజ్య సుంకాల (టారిఫ్‌లు) విధానాలు కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ పరిణామాలన్నీ రిపబ్లికన్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయి. ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ కూడా రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.
అధిక ధరలకు ట్రంప్ ప్రభుత్వమే కారణమని చాలామంది ఓటర్లు భావిస్తున్నట్లు ‘ది ఏపీ ఓటర్ పోల్’ సర్వే వెల్లడించింది.
అధ్యక్షుడి అధికారాలకు కాంగ్రెస్ ద్వారా అడ్డుకట్ట వేయాలని ఓటర్లు కోరుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. దీంతో డెమొక్రాట్లకు రెండు సభల్లోనూ ఆధిపత్యం దక్కింది.
భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు మెజారిటీ సాధించడం భారత్‌కు కూడా కీలక పరిణామమే. ముఖ్యంగా వాణిజ్యం, వలస విధానాలు, రక్షణ సహకారం వంటి అంశాలపై దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌కు చట్టాల రూపకల్పన, ప్రభుత్వ విధానాలపై దర్యాప్తులు నిర్వహించడం, నిధుల కేటాయింపులను పర్యవేక్షించడం వంటి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అంశాల్లో డెమొక్రాట్ల బలం పెరగనుంది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వారు మరింత ప్రశ్నించే అవకాశం ఉంది.
అయితే విదేశాంగ విధానంలో అధ్యక్షుడిదే కీలక పాత్ర. వీటో అధికారం కూడా ట్రంప్ వద్దే ఉంటుంది. అందువల్ల డెమొక్రాట్లు కాంగ్రెస్‌ను నియంత్రించినంత మాత్రాన అన్ని విధానాలను మార్చడం సాధ్యం కాదు.
అయినప్పటికీ భారత్‌కు సంబంధించిన కొన్ని కీలక అంశాలపై అమెరికా రాజకీయాల్లో చర్చ పెరిగే అవకాశం ఉంది.
వాణిజ్యం, టారిఫ్‌లపై ప్రభావం ఎలా?
భారత ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అందువల్ల అమెరికా ప్రభుత్వం తీసుకునే టారిఫ్ నిర్ణయాలు భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం చూపుతాయి.
ముఖ్యంగా భారతీయ కంపెనీలకు అమెరికా మార్కెట్లో వ్యాపారం చేయడం ఖర్చుతో కూడుకున్న అంశంగా మారవచ్చు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించాయి.
ఇందులో భాగంగా భారత ఉత్పత్తులపై 18 శాతం టారిఫ్‌లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది.
అయితే వాణిజ్య భాగస్వాములపై అత్యవసర అధికారాలను ఉపయోగించి ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రస్తుతం ఈ సుంకాలు 10 శాతానికి తగ్గాయి.
మరోవైపు భారత్, అమెరికా మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం ఇంకా ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దశకు చేరుకుందని చెప్పారు.
కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ఈ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. టారిఫ్‌ల విషయంలో కూడా కొత్త రాజకీయ పరిస్థితులు ప్రభావం చూపవచ్చు.
హెచ్-1బీ వీసాలపై భారతీయులకు ఊరట లభిస్తుందా?
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు హెచ్-1బీ వీసాలు చాలా కీలకం. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయులు ఈ వీసాలపై ఆధారపడుతున్నారు.
తాజా ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో అమెరికా వలస విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో వలస చట్టాలపై చర్చ, పర్యవేక్షణ మరింత పెరగవచ్చు. రిపబ్లికన్లు ప్రతిపాదించిన కొన్ని కఠిన నిబంధనలకు డెమొక్రాట్లు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
దీంతో భారతీయ నిపుణులకు కొంత ఊరట లభించవచ్చని భావిస్తున్నారు.
అయితే హెచ్-1బీ వీసా నిబంధనల్లో వెంటనే మార్పులు వస్తాయని చెప్పలేం. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులకు 100,000 డాలర్ల ఫీజు వసూలు చేయాలన్న ట్రంప్ అధ్యక్ష ప్రకటనను రద్దు చేయడం కూడా అంత సులభం కాదు.
కాంగ్రెస్‌లో డెమొక్రాట్లకు బలం పెరిగినప్పటికీ వీసా విధానాల్లో మార్పులు తీసుకురావడానికి మరింత సమయం పట్టవచ్చు.
అందువల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.
ట్రంప్‌కు కాంగ్రెస్‌లో ఎదురుదెబ్బ.. కానీ అధికారాలు ఆయన చేతుల్లోనే!
డెమొక్రాట్లు సెనేట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ విజయం సాధించినప్పటికీ ట్రంప్ అధికారాలు పూర్తిగా తగ్గిపోవు.
ముఖ్యంగా అధ్యక్షుడికి ఉన్న వీటో అధికారం డెమొక్రాట్ల నిర్ణయాలకు అడ్డంకిగా మారవచ్చు.
సెనేట్‌లో అమల్లో ఉన్న ఫిలిబస్టర్ నిబంధనలు కూడా వారు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి.
అందువల్ల కాంగ్రెస్‌పై పట్టు సాధించినంత మాత్రాన ట్రంప్ అజెండాను పూర్తిగా అడ్డుకోవడం డెమొక్రాట్లకు సాధ్యం కాకపోవచ్చు.
ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా ప్రస్తావించారు.
డెమొక్రాట్లు కాంగ్రెస్‌ను గెలిచినా ట్రంప్ అజెండాను అడ్డుకోవడానికి వారు చేయగలిగింది చాలా తక్కువేనని వ్యాఖ్యానించారు.
మొత్తంగా చూస్తే అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారాయి.
మరోవైపు భారత్‌కు సంబంధించి వాణిజ్య ఒప్పందం, టారిఫ్‌లు, హెచ్-1బీ వీసాలు, రక్షణ సహకారం వంటి అంశాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అయితే వీటిపై తక్షణ మార్పులు వస్తాయా లేదా అన్నది రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం, కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.



