“నువ్వు పిచ్చిగా వ్యవహరిస్తున్నావు… ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు” అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
లెబనాన్ దాడులపై ఆగ్రహం
లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడం వల్ల అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న చర్చలు దెబ్బతింటాయనే ఆందోళనతో ట్రంప్ నేతన్యాహూకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ సంభాషణలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
“అందరూ ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారు”
ఆ కాల్‌లో ట్రంప్, “నువ్వు ఇలా కొనసాగితే ప్రపంచంలో ఇజ్రాయెల్ మరింత ఒంటరిపడుతుంది. ఇప్పుడు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. ఇజ్రాయెల్‌ను కూడా ద్వేషిస్తున్నారు” అని వ్యాఖ్యానించినట్లు నివేదికలు తెలిపాయి. అలాగే “నేను లేకపోతే నువ్వు జైలులో ఉండేవాడివి” అని కూడా అన్నట్లు సమాచారం.
మరో వర్గం సమాచారం ప్రకారం, “ఏం చేస్తున్నావు?” అంటూ ట్రంప్ నేతన్యాహూపై గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
బీరూట్ దాడి నిలిపివేసినట్టు ట్రంప్ వ్యాఖ్య
ఫోన్ సంభాషణ తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై పెద్ద ఎత్తున దాడి చేయవద్దని తాను నేతన్యాహూను కోరగా, ఆయన సైన్యాన్ని వెనక్కి మళ్లించారని పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం హిజ్బుల్లా దాడులు కొనసాగితే చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

