వన్యప్రాణుల కదలికలపై రియల్‌టైమ్ నిఘా
తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ కోసం టీటీడీ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) వినియోగంపై పరిశీలన చేస్తోంది.
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడంతోపాటు భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగించే అవకాశాలను టీటీడీ పరిశీలిస్తోంది.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద క్వాడ్రుపెడ్ రోబోట్ పనితీరును టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు.
అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండే, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఈ రోబోట్‌ను ఎలా ఉపయోగించవచ్చో అధికారులు వివరాలు తెలుసుకున్నారు.

రోబోట్‌లో ఆధునిక టెక్నాలజీ
ఈ రోబోట్‌లో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది.
దీంతో చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
రోబోట్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించగలదు.
వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో-ట్యాగ్డ్ అలర్ట్ పంపే అవకాశం ఉంటుంది. అలాగే లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించవచ్చు.

చిరుతల కదలికలను ముందుగానే గుర్తించే అవకాశం
అలిపిరి-తిరుమల నడక మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉంది.
జంతువుల కదలికలను గుర్తించిన వెంటనే భక్తులను అప్రమత్తం చేయడంతోపాటు అటవీ, విజిలెన్స్, భద్రతా సిబ్బంది వేగంగా స్పందించేందుకు ఇది సహాయపడుతుంది.
వన్యప్రాణులు భక్తుల రాకపోకల ప్రాంతం వైపు వచ్చినప్పుడు రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి వాటిని అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలించారు.
ఇలా చేయడం వల్ల మనుషులు, వన్యప్రాణుల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు అవకాశం తగ్గుతుందని టీటీడీ భావిస్తోంది.
ఇప్పటికే ఉన్న నిఘా వ్యవస్థలకు అదనంగా

ఈ రోబోట్ ఇప్పటికే అమల్లో ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా ఉండదు.
వాటికి అదనంగా మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా ఉపయోగించే అవకాశం ఉంది.
వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి రోబోట్‌ను త్వరగా మోహరించవచ్చు.
అటవీ ప్రాంతాల్లో రోబోట్ సేకరించే వీడియోలు, థర్మల్ చిత్రాలు, వన్యప్రాణుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాటి సంచారాన్ని మరింత సమర్థవంతంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
దీని ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.



