భోపాల్‌లో సంచలనం రేపిన ట్విషా శర్మ మృతి కేసులో కొత్త అంశాలు బయటపడ్డాయి. కట్నం వేధింపులు, మానసిక హింస ఆరోపణల మధ్య ఆమె మరణానికి ముందు సెలూన్‌కు వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.
మే 12న మధ్యాహ్నం 3:12 గంటల సమయంలో ట్విషా శర్మ సెలూన్‌కు వెళ్లినట్లు వీడియోల్లో కనిపించింది. అక్కడ ఆమె హెడ్ మసాజ్, పెడిక్యూర్ చేయించుకుంది. దాదాపు మూడు గంటల తర్వాత సాయంత్రం 6:15 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే రోజు రాత్రి భోపాల్‌లోని అత్తింట్లో ఆమె ఉరివేసుకుని కనిపించింది.
ట్విషా శర్మ సెలూన్‌కు తరచూ వచ్చేదని యజమాని కిరణ్ పరిహార్ తెలిపారు. అయితే తొమ్మిది నెలల విరామం తర్వాత ఈసారి వచ్చినట్లు చెప్పారు. మరుసటి ఉదయం ట్విషా అత్త గిరిబాలా సింగ్ ఫోన్ చేసి పలుమార్లు వివరాలు అడిగినట్లు తెలిపారు.
“ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళ్లింది? ఎలా చెల్లించింది? దానికి ఏమైనా రికార్డు ఉందా?” అంటూ గిరిబాలా సింగ్ ప్రశ్నించారని కిరణ్ తెలిపారు. అయితే ట్విషా ఆ రోజు డబ్బులు చెల్లించలేదని, ఇప్పటికే ప్రీపెయిడ్ ప్యాకేజీ ఉండటంతో సేవలు తీసుకుందని చెప్పారు. తన సోదరుడి పెళ్లి సమయంలో ఫిబ్రవరిలో ఆ ప్యాకేజీ తీసుకుందని వివరించారు.
మధ్యాహ్నం మరోసారి ఫోన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ కావాలని గిరిబాలా సింగ్ అడిగారని తెలిపారు. ఆమె ఆందోళనగా కనిపించడంతో “అన్నీ బాగున్నాయా?” అని అడిగితే, ట్విషా ఆత్మహత్య చేసుకుందని చెప్పారని కిరణ్ గుర్తుచేశారు.
ఆ తర్వాత న్యాయవాదుల మాదిరిగా నలుపు-తెలుపు దుస్తుల్లో ఐదారు మంది సెలూన్‌కు వచ్చారని చెప్పారు. వారిలో ఓ మహిళ తనను అడ్వకేట్‌గా పరిచయం చేసుకుని, పోలీసులకు ఫుటేజ్ అవసరమని తెలిపిందన్నారు. సీసీటీవీ టెక్నీషియన్‌ను పిలిపించి తమ ముందే ఫుటేజ్ తీసుకెళ్లారని వివరించారు.
అయితే వారు నిజంగా న్యాయవాదులేనా? ఎవరు పంపించారు? అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోవడం కేసులో మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
నోయిడాకు చెందిన ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని అత్తింట్లో మృతిగా కనిపించింది. భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ కట్నం కోసం మానసికంగా వేధించారని ట్విషా కుటుంబం ఆరోపిస్తోంది.
పోస్టుమార్టం నివేదిక, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్యేనని పోలీసులు చెబుతున్నారు. అయితే కుటుంబం అభ్యర్థన మేరకు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
పది రోజుల పాటు పోలీసులకు కనిపించకుండా తిరిగిన సమర్థ్ సింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇవాళ అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.

