వరంగల్ లో అరుదైన రెండు తలల పాములను విక్రయించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో డీఆర్ఐ అధికారులు ఆదివారం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సంచిని తనిఖీ చేయగా అందులో రెండు తలలున్న 2 పాములు సజీవంగా లభ్యమయ్యాయి. పట్టుబడిన వ్యక్తితో పాటు స్వాధీనం చేసుకున్న రెండు పాములను డీఆర్ఐ అధికారులు వరంగల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అప్పగించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఇండియన్ రెడ్ సాండ్ బోవా జాతికి చెందిన రెండు అరుదైన పాములు బయటపడ్డాయి. ఈ పాములకు అక్రమ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. క్షుద్ర పూజలు, అదృష్టం కోసం, అలాగే కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీ కోసం ఈ పాములను భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల నుంచి పాములను సేకరించి లక్షల రూపాయలకు విక్రయించేందుకు పలువురు ప్రయత్నిస్తూ ఉన్నారు.
