లోక్‌సభలో మెజారిటీ తేల్చకుండానే అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజన జరిగి నేటికి 12 ఏళ్లు పూర్తయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత పార్లమెంట్ చరిత్రలోనే విభజన జరిగిన రోజును ఒక ‘బ్లాక్ డే’గా అభివర్ణించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన సుమారు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఆస్తుల విషయంలో ఇప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తంలో కనీసం రూ. 70-80 వేల కోట్లయినా ఏపీకి వచ్చే అవకాశం ఉందని, దీనిని సాధించుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు.అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఉండవల్లి హితవు పలికారు.
