ఉత్తరాంధ్రలో ప్రముఖ క్షేత్రంగా పేరుగాంచిన ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాంసాహార విందు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఆలయ ప్రాంగణంలో సాధారణంగా శాఖాహార విందులు మాత్రమే నిర్వహించే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో ఈ ఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ప్రకారం, ఎస్. రాయవరం మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడి కుటుంబ వివాహ వేడుకల్లో భాగంగా ఆలయ సమీపంలో మాంసాహార విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరైనట్టు సమాచారం.ఈ ఘటనపై స్పందించిన పాయకరావుపేట టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. ఆలయ పరిమితుల్లో ఇలాంటి చర్యలు అనుచితమని పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు టీడీపీ నాయకులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గింజల లక్ష్మణరావు, మహిళా అధ్యక్షురాలు షేక్ మునిసా బేగం తదితరులు పాల్గొన్నారు.
