భారత డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యం కొనసాగుతోంది. ‘world line’ విడుదల చేసిన ‘ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ ప్రకారం, 2025 తొలి అర్ధభాగంలో యూపీఐ లావాదేవీలు 35% పెరిగి 106.36 బిలియన్లు, విలువ రూ. 143.34 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
యూపీఐ సగటు లావాదేవీ విలువ రూ. 1,478 నుంచి రూ. 1,348కి తగ్గింది, అంటే చిన్నచిన్న రోజువారీ చెల్లింపులు పెరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీలు 37% పెరిగి 67.01 బిలియన్లకు చేరాయి — దీనికి ‘కిరాణా ఎఫెక్ట్’ కారణమని నివేదిక తెలిపింది.
డిజిటల్ మౌలిక సదుపాయాల్లో కూడా భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా క్యూఆర్ కోడ్‌లు 111% పెరిగి 678 మిలియన్లు, POS టెర్మినళ్లు 29% పెరిగి 11.2 మిలియన్లు అయ్యాయి.
క్రెడిట్ కార్డుల వినియోగం 23% పెరగగా, చిన్న చెల్లింపులు యూపీఐ వైపు మళ్లడంతో డెబిట్ కార్డుల వినియోగం 8% తగ్గింది. మొత్తం మొబైల్ చెల్లింపులు 30% వృద్ధితో 98.9 బిలియన్ల లావాదేవీలు, విలువ రూ. 209.7 ట్రిలియన్‌గా నమోదయ్యాయి.
