‘Duration of Status’ విధానానికి ముగింపు.. ఇక నిర్దిష్ట కాలంపాటే అమెరికాలో ఉండే అవకాశం
విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు కొత్త నిబంధనలు అమలు
వాషింగ్టన్: అమెరికా Department of Homeland Security (DHS) విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధులకు వర్తించే “Duration of Status (D/S)” విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తూ తుది నిబంధన (Final Rule)ను ప్రకటించింది.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ మార్పుతో విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులు ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా అమెరికాలో నిరవధికంగా ఉండే అవకాశం ఇక ఉండదని DHS వెల్లడించింది.
ఇప్పటివరకు తమ వీసా నిబంధనలు పాటిస్తున్నంత కాలం అమెరికాలో కొనసాగేందుకు అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై వారికి నిర్దిష్ట కాలానికి మాత్రమే ప్రవేశ అనుమతి ఇస్తారు.
F-1, J-1 వీసాలకు నాలుగేళ్ల గరిష్ట పరిమితి
కొత్త నిబంధనల ప్రకారం F-1 విద్యార్థి వీసా, J-1 ఎక్స్చేంజ్ విజిటర్ వీసా కలిగిన వారికి వారి విద్యా లేదా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వ్యవధి మేరకు మాత్రమే ప్రవేశ అనుమతి ఉంటుంది. అయితే ఒకేసారి గరిష్టంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.
అధికారికంగా అనుమతించిన గడువుకు మించి అమెరికాలో కొనసాగాలంటే US Citizenship and Immigration Services (USCIS) వద్ద Extension of Stay కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
F-1 విద్యార్థులకు అదనపు పరిమితులు
కొత్త నిబంధనల్లో F-1 విద్యార్థులకు మరికొన్ని కీలక పరిమితులు విధించారు.
- English language training ప్రోగ్రామ్‌లలో చదివే F-1 విద్యార్థులు మొత్తం కలిపి 24 నెలల కంటే ఎక్కువ కాలం ఉండలేరు.
- చదువు పూర్తైన తర్వాత అమెరికాలో ఉండేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను 30 రోజులకు తగ్గించారు.
- అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు మొదటి విద్యా సంవత్సరంలో సాధారణంగా మేజర్ మార్చడం లేదా మరో విద్యాసంస్థకు బదిలీ కావడం అనుమతించరు.
- గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ విద్యా లక్ష్యాలను మార్చడంపై కఠిన పరిమితులు అమల్లోకి వస్తాయి.
- ఒక డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అదే స్థాయి లేదా అంతకంటే తక్కువ స్థాయి కొత్త కోర్సును ప్రారంభించేందుకు అనుమతి ఉండదు.
వీసా మీడియా ప్రతినిధులకు కూడా కొత్త నిబంధనలు
వీసాపై అమెరికాకు వెళ్లే విదేశీ మీడియా ప్రతినిధులకు కూడా కొత్త విధానం వర్తిస్తుంది.
వారికి అప్పగించిన జర్నలిస్టిక్ అసైన్మెంట్ పూర్తి చేసేందుకు అవసరమైన కాలానికి మాత్రమే ప్రవేశ అనుమతి ఉంటుంది. అయితే అది 240 రోజులను మించకూడదు. అంతకంటే ఎక్కువ కాలం ఉండాలంటే గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.
People’s Republic of China పాస్‌పోర్ట్ కలిగిన మీడియా ప్రతినిధులకు మాత్రం 90 రోజుల ప్రవేశ పరిమితి మాత్రమే ఉంటుంది.
అలాగే విదేశీ మీడియా సంస్థగా గుర్తింపు పొందాలంటే ఆ సంస్థ నిరంతరం జర్నలిస్టిక్ సమాచారం తయారు చేయడం, విదేశాల్లో ప్రధాన కార్యాలయం కలిగి ఉండడం తప్పనిసరి అని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.
Extension కోసం Form I-539 తప్పనిసరి
ఇప్పటివరకు విద్యాసంస్థలు లేదా ప్రోగ్రామ్ స్పాన్సర్లు సాధారణ ప్రక్రియలో గడువు పొడిగింపులు నిర్వహించేవారు. ఇకపై ఆ విధానం ఉండదు.
వీసా గడువు పొడిగించాలనుకునే వారు Form I-539ను USCISకు సమర్పించాలి. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ వివరాలు ఇవ్వడం, అవసరమైతే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావడం తప్పనిసరి కావచ్చు.
దరఖాస్తు పరిశీలనలో ఉన్న సమయంలో అర్హులైన విద్యార్థులు, మీడియా ప్రతినిధులకు గరిష్టంగా 240 రోజుల వరకు ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ పొడిగింపు లభించవచ్చు.
ఎప్పుడు అమల్లోకి వస్తాయి?
ఈ తుది నిబంధనలు Federal Registerలో ప్రచురించిన తేదీ నుంచి 60 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి.
ప్రస్తుతం “Duration of Status” విధానం కింద అమెరికాలో ఉన్న వారు, తమ ప్రస్తుత ప్రోగ్రామ్ ముగిసే వరకు అక్కడ ఉండవచ్చు.
అయితే అది కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి నాలుగేళ్లను మించకూడదు.
అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి బయటకు వెళ్లి మళ్లీ ప్రవేశించే వారు కొత్త
నిర్దిష్ట గడువు విధానం ప్రకారమే ప్రవేశ అనుమతి పొందుతారు.



