US-IRAN శత్రుత్వానికి ముగింపు దిశగా అడుగు
వాషింగ్టన్: US-IRAN మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో ‘ఇస్లామాబాద్ మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)’ పేరుతో 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు అమెరికా సీనియర్ అధికారులు బుధవారం వెల్లడించారు.
ఈ ఒప్పందం తుది శాంతి ఒప్పందం కాదని, వచ్చే 60 రోజుల్లో జరిగే చర్చలకు మార్గదర్శకంగా పనిచేసే మధ్యంతర చట్రంగా రూపొందించామని అధికారులు తెలిపారు.
రెండు దేశాలు పరస్పర సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ఒప్పందంలో పేర్కొన్నారు.
ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో తుది ఒప్పందంపై చర్చలు పూర్తి చేయాలని నిర్ణయించారు. అవసరమైతే పరస్పర అంగీకారంతో గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. తుది ఒప్పందం కుదిరితే, దానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బలమైన తీర్మానం ద్వారా ఆమోదం లభిస్తుంది.
చర్చలు విజయవంతమైతే ఇరాన్‌తో ఆర్థిక సహకారానికి మార్గం సుగమం అవుతుందని అధికారులు తెలిపారు. కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన పునర్నిర్మాణ, ఆర్థికాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని ఒప్పందంలో సూచించారు.
చివరి ఒప్పందం కుదిరి, ఇరాన్ తన హామీలను అమలు చేస్తే ఆంక్షల సడలింపుతో ఇతర దేశాలు ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని ఒక సీనియర్ అధికారి చెప్పారు.
ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించినది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదని ఒప్పందంలో స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న అధిక సాంద్రత కలిగిన అణు పదార్థాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలో డౌన్‌బ్లెండింగ్ విధానం ద్వారా నిర్వీర్యం చేయాలని నిర్ణయించారు.



