‘సుజల స్రవంతి’కి రూ. 600 కోట్లు జూన్ కల్లా అనకాపల్లికి గోదావరి

February 27, 2026 4:18 PM

ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశ్యామలం చేసే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం రూ. 600 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం అసెంబ్లీలో వెల్లడించారు.

కేటాయించిన రూ. 600 కోట్లలో రూ. 500 కోట్లు పనులకు, రూ. 100 కోట్లు భూసేకరణకు వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేసి, 2026 జూన్ నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అనకాపల్లి వరకు గోదావరి నీటిని తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించడంతో పాటు విశాఖ పారిశ్రామిక అవసరాలను తీర్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారని, కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ. 1209 కోట్లు కేటాయించి పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు.సుజల స్రవంతి కాకుండా ఉత్తరాంధ్రలో మరో 11 ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను గుర్తించి, వాటి కోసం రూ. 460 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media