“తెలుగు భాషను రాయడం, చదవటం నేర్చుకోవడమే వేటూరికి మనం ఇచ్చే నిజమైన నివాళి” అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి ఆధ్వర్యంలో వేటూరి సుందర రామమూర్తి 90వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన మొపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో కనులపండువగా జరిగాయి.

వేటూరి రాసిన సినీయేతర సాహిత్య గ్రంథాలకు (మానస వీణ, ఝమ్మంది నాదం, ఎడారిలో కోయిల మొదలైనవి) పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించి, స్వామివారి సన్నిధిలో పూజలు జరిపించారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కోసం వేటూరి తన జాతీయ పురస్కారాన్ని సైతం వెనక్కి ఇచ్చి పోరాడారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గుర్తుచేసుకున్నారు.వేటూరి రాసిన ఆరు సంపుటాల విశిష్ట సాహిత్యాన్ని పెదకళ్లేపల్లి గ్రామ ప్రజలకు అంకితం చేశారు.

ఈ గ్రంథాలను రాష్ట్రంలోని ప్రతి లైబ్రరీకి అందజేస్తామని డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రకటించారు.వేటూరి పాటల్లో ఉన్న అర్థం, భావం నేటి పాటల్లో మృగ్యమైందని, కేవలం శబ్దం మాత్రమే వినిపిస్తోందని అతిథులు అభిప్రాయపడ్డారు. గాయకులు వేటూరి రాసిన సూపర్ హిట్ పాటలను ఆలపించి గ్రామస్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.
