తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం గట్టెక్కింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా, 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విజయ్, ఈ విశ్వాస పరీక్షతో తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఓటింగ్‌కు ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన 59 మంది ఎమ్మెల్యేలతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక, మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే (47 మంది ఎమ్మెల్యేలు) ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. డీఎంకే వాకౌట్, మరికొందరు తటస్థంగా ఉండటంతో, పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
