కురుపాం మార్కెట్ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన నగరేశ్వరస్వామి–వింధ్యావాసిని మరియు జనార్ధనస్వామి–కోనకమలాదేవి దేవేరుల కళ్యాణ మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. గత నెల 27న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు భక్తి వైభవంగా కొనసాగాయి.

చివరి రోజు అవపోసన, బలిహరణ, ఈశ్వరాభిషేకం, సహస్రనామార్చన, పూర్ణాహుతి, ప్రసాద విఠరణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పుష్పయాగం, పండితుల సత్కారం, దేవేరులకు వివిధ రకాల స్వీట్స్, ఫ్రూట్స్ నివేదనతో పాటు దంపత తాంబూలాల సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి.

ఆలయ ఆస్థాన ప్రధాన పురోహితులు ఆర్.బి.బి. కుమారశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించగా, శైవాగమ విద్వాన్ చంద్రమౌళి ప్రభాకర సత్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
