విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఈ నిధులతో ప్లాంట్ గత మూడు నెలల్లో లాభాల దిశగా సాగుతోందన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందనే దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ అంశంపై జరుగుతున్న అపోహలను కార్యకర్తలు ప్రజల్లో నివృత్తి చేయాలని పిలుపునిచ్చారు.పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్యకర్తలు ప్రజలకు చేరువగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే బూత్ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.అనకాపల్లి జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ద్వారా సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 50 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు.
