నగరంలోని ప్రధాన కూడలి వరంగల్ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం ఓ మహిళ కత్తితో హల్చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తన ఆస్తులను ఆక్రమించడమే కాకుండా, వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త వేధిస్తున్నాడంటూ ఆమె నడిరోడ్డుపై ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త చౌరస్తాలోని ఒక షాపులో ఉన్నాడని తెలుసుకున్న సదరు మహిళ, కత్తితో అక్కడికి చేరుకుని ఒక్కసారిగా హంగామా సృష్టించారు. భర్తపై దాడికి యత్నించడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. “నా ఆస్తులు ఆక్రమించుకున్నాడు పరాయి మహిళతో సంబంధం పెట్టుకుని నాకు దూరంగా ఉంటున్నాడు” అంటూ ఆమె పెద్ద పెట్టున కేకలు వేశారు. భార్య నుంచి తప్పించుకునేందుకు భర్త సమీపంలోని ఒక షాపులో తలదాచుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న మట్టెవాడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహిళను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. మహిళ చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకుని, ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.
