మొదట వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు.. ఆ తర్వాత తీసేశామన్నారు

May 20, 2026 12:34 PM

మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన టెక్ దిగ్గజం మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ) సంస్థలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ఏఐ పై మెటా 125 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని భావిస్తోంది. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ – WFH చేయండి అంటూ యాజమాన్యం నుంచి వచ్చిన ఒక సాధారణ సూచనతో ఈ లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లోని ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని యాజమాన్యం చెప్పింది. వరుసగా ఈమెయిల్స్ రావడం మొదలైంది.

మెటా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 10 శాతానికి సమానమైన సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ లేఆఫ్స్ ప్రారంభించింది. సింగపూర్ హబ్ నుంచి ఈ మొదటి తొలగింపు సందేశాలు వెలువడ్డాయి. సింగపూర్‌లోని పలువురు ఉద్యోగులకు ఈమెయిల్స్ వచ్చాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆయా టైమ్ జోన్ల ఆధారంగా ఉద్యోగులందరికీ విడతలవారీగా నోటిఫికేషన్లు పంపుతున్నారు. మొదట ఇంటి నుంచి పని చేయమనడం, ఆ వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ కోతలకు ముందు మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వేలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. మరో వేలాది మందిని వేరే విభాగాలకు బదిలీ చేస్తున్నారు. దాదాపు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ (AI) ఆధారిత విభాగాలకు బదిలీ చేయనున్నట్లు చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ఒక అంతర్గత మెమోలో తెలిపారు. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలపై ఈ కోతల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో మరిన్ని ఉద్యోగాల కోతలు కూడా ఉండవచ్చని సమాచారం. ఏఐ (AI) ని కంపెనీకి కేంద్ర ప్రాధాన్యతగా మార్చుకున్న జుకర్‌బర్గ్, ఈ ఏడాది 125 నుంచి 145 బిలియన్ డాలర్లను ఏఐ పైనే ఖర్చు చేయాలని యోచిస్తున్నారు.

ఈ పరిస్థితి కేవలం మెటాకే పరిమితం కాలేదు. టెక్ రంగం అంతటా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. సిస్కో సిస్టమ్స్ గత వారం 4,000 ఉద్యోగాలను తగ్గించింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, డిస్నీ, ASML అన్నీ లేఆఫ్స్ లేదా స్వచ్ఛంద నిష్క్రమణలను ప్రకటించాయి. ఏప్రిల్‌లో, ఒరాకిల్ సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా తెల్లవారుజామున పంపిన ఈమెయిల్స్ ద్వారా ఏకంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఈ ఏఐ కాలంలో ఉద్యోగులు కేవలం కోడింగ్ చేయడం మాత్రమే కాకుండా, సంక్లిష్టమైన ఏఐ సిస్టమ్స్‌ను డిజైన్ చేసి నడపగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media